భారత దేశంలోనే అది ఒక అరుదైన గ్రామం, గ్రామీణ ప్రాంతం అనగానే మొదట మనకు గుర్తొచ్చేది ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని పంటలు, స్వచ్ఛమైన మనుషులు కానీ ఈ గ్రామం లో అటువంటివి ఏవి కనిపించిక పోగా నిర్మానుష్యమైన వీధులు, చిన్న చప్పుడైనా స్పష్టంగా చెవిని చేరేంత నిశ్శబ్దం, ఇక్కడ మనుషులు జీవించేవారు అన్న దానికి నిదర్శనంగా నగ్నంగా దర్శనమిచ్చే పగిలిన గోడలు, రాత్రయితే చాలు ఏవో అరుపులు, నీకోసమే ఎదురుచూస్తున్నట్టు అగుపించే విచిత్రమైన ఆకారాలు, వీటికి ప్రత్యేకంగా కాపలా కాస్తున్నట్టు గాలులు చేసే వింతైన శబ్దాలు, ఈ పరిస్థితుల నడుమ ఎవరైనా ఈ గ్రామంలోకి వెళ్లాలి అన్న సాహసం చేయగలరా? అందుకే ఈ గ్రామం ప్రత్యేకత సంతరించుకుంది కాలక్రమేణా ‘దెయ్యాల గ్రామం’ గా పిలువబడింది.
భారత భూభాగంలో వాయువ్యంగా ఉన్న రాష్ట్రాలలో రాజస్థాన్ ది ఒక ప్రత్యేకమైన స్థానం. వైశాల్యం ప్రకారం దేశంలో అతి పెద్ద రాష్ట్రం ,రాజస్థాన్ లో ఎక్కువ కాలం రాజపుత్ర వంశీయులు పాలన సాగించిన మూలాన ఎన్నో చారిత్రకమైన కట్టడాలు వెలువడ్డాయి, విలక్షణమైన కట్టుబాట్లు, ఆహారపు అలవాట్లు, వేషధారణ, సాంప్రదాయాలు ఇప్పటికీ రాజస్థాన్ చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగిఉండటం గమనార్హం.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ కి నైరుతి దిశగా 18kms దూరంలో ఉన్న ఈ అరుదైన గ్రామం గురించి స్థానికుల ప్రకారం ఎన్నో కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
1.ఈ గ్రామాన్ని తన పరిపాలన ప్రాంతంగా చేసుకుని పాలించిన రాణి పట్ల ఆకర్షితుడైన ఒక మంత్రగాడు ఆ రాణి తన ప్రేమను చులకన చేయడం ఓర్వలేక ఈ గ్రామాన్ని తన మంత్ర శక్తి తో శపించి స్మశానంగా మార్చాడు అన్నది కొందరి వాదన.
2.ఈ గ్రామం సలీం సింగ్ అనే క్రూరమైన మంత్రి ఆధీనంలో ఉండేది అని తను ఈ గ్రామం లోని ఓ బాలికను ఇష్టపడి ఎలాగైన ఆమె తనకు కావాలని లేకుంటే గ్రామాన్ని స్మశానం చేస్తానని బెదిరించాడట. దీంతో గ్రామస్థులు ఆ బాలిక ని పంపడం ఇష్టం లేక రాత్రికి రాత్రి ఊరంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు అన్నది ఒక వాదన.
3. ఒక వర్గం ప్రకారం, ఈ గ్రామంలో చాలా సంవత్సరాల పాటు పాలివాల్ బ్రాహ్మణులు వుండేవారు. అక్కడి పాలకులు వాళ్ళను పన్నుల విషయంలో చిత్రహింసలు పెట్టేవాళ్ళు అని ఆ బాధలు భరించలేక పాలివాల్ బ్రాహ్మణులు శపించి గ్రామంనుంచి వెళ్లిపోయారు అన్నది కొందరి వాదన.
4. విపరీతమైన కరువు వలన ప్రజలు నీళ్ళు, ఆహారం దొరక్క ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వేరే వూళ్ళకి వలసపోయారని కొంత మంది స్థానికుల వాదన.
ఈ వదంతులని నమ్మని ఒక ఇండియన్ పారానార్మల్ సొసైటీ సభ్యుడు ఢిల్లీ నుంచి తన టీం తో కలిసి ఈ గ్రామం గుట్టు విప్పడానికి ఒక రాత్రి మొత్తం అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడట.
కానీ అక్కడికి వెళ్లగానే ఏవో వింత అరుపులు భయంకరమైన శబ్దాలు వినిపించాయనీ,తెల్లటి చారలు తిరుగుతున్నట్టుగా అనిపించింది అని అందుకే తన టీమ్ తో సహా అక్కడ నుండి హుటాహుటిన వచ్చేసాను అని వివరించాడట.
ఆ తర్వాత నుంచి ఈ గ్రామాన్ని శాపగ్రస్త గ్రామం అని దెెయ్యాల గ్రామం అని ప్రజలు ధృడంగా విశ్వాసించడం మొదలుపెట్టారు అని ప్రసిద్ధి.
ఇప్పటికీ సాయంత్రం దాటగానే ఆ గ్రామం వైపు ఎవరిని వెళ్లనీయకుండా చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు హెచ్చరిస్తూ ఉంటారట.
ఇదే ఈ రోజుకి తన గుట్టు విప్పని గ్రామం కథ.
‘ కుల్ ధార ‘ కథ.