Menu
in ,

వడ్డాణం

వడ్డాణం పెద్దలు  మన కోసం ఇచ్చిన ఒక ఆభరణం. ప్రాచీన కాలం లో బంగారంతో, వజ్రాలు తాపి ధరించేవారు. దీన్ని ఆడ, మగా అందరూ ధరించేవారు.

కావాలంటే తిరుమల వేంకటేశ్వరుని దర్శించండి. ఆయనకేం ధనవంతుడు, ఏమైనా ధరించవచ్చు అంటారా. సరే మన రాజుల కధలు , చరిత్ర లో ని రాజుల విగ్రహాలు చూడండి.

హరిశ్చంద్ర కధ చూడండి. ఒక కాటికాపరి దగ్గర ఎంత ధనం ఉందో. సాధారణమైన మనిషి, ఏనుగు మీద నిలబడి, ఒక నాణెం పైకి ఎగరవేస్తే ఎంత ఎత్తుకు వెళుతుందో, అంత ధనం పోసి హరిశ్చంద్రుని కొనుగోలు చేశారు.

అంటే ఆనాడు ప్రతీ ఒక్కరూ నడుముకు వడ్డాణం ధరించేవారు. దానివలన ముందు పొట్ట రాదు.తర్వాత నడుము నొప్పి రాదు. మనం పని చేసేటప్పుడు రకరకాల భంగిమలలో శరీరాన్ని వంచుతాము. కాని వాటి వలన వెన్ను పూసల మీద భారం పడి నడుము నొప్పి వస్తుంది.

అదే నడుంబెల్టు పెట్టు కుని అటూఇటూ, ఇష్టం వచ్చి నట్టు తిరగ గలమా. వెంటనే బెల్ట్ నొక్కు తుంది. దాంతో పొశ్చర్ కరెక్ట్ చేసుకుంటాము. అందుకనే వడ్డాణం ధరించేవారు.

భారతదేశం మీద దాడులు జరిగి, సంపదలను దోచుకోవడంతో, ఈ వడ్డాణం ఖరీదు అయ్యింది. అందులోనూ బంగారం ఆకాశానికి ఎగబాకింది, వడ్డాణం మెఘాలలో విహరిస్తుందాయే. ఉన్నవారు జాగ్రత్తగా లాకర్ లో దాచుకుని, పెళ్ళి-పేరంటాలపుడు ధరించి, మెరిసిపొతుంటారు.

మధ్యతరగతి వారు రెండు గొలుసులతో, పెద్ద లాకెట్ చేయించి,  నాజూకు నడుముకు, వయ్యారంగా చుట్టి, టూ ఇన్ వన్ అంటూ, అమ్మాయిని కన్యాదానం చేస్తున్నారు. వియ్యాలవారు ఇదేం వడ్డాణం అన్నారో, లేటెస్ట్ ఫ్యాషన్ అంటూ నోరుమూయిస్తారు. ఆడపడుచు ఉందా, ఆమె ఫోర్ ఇన్ వన్, పైవిన్ వన్ తీసుకోలేదేమి? అనగానే, గొడవ అక్కడితో సమాప్తం. ఎక్కువగా ఏమి మాట్లాడినా, ఆడపడుచుకు కొనాల్సిన వస్తుందని, అత్తా మామ సడిచెయ్యరు.

మరి పేదవారి కోసం ఫ్యాషన్ డిజైనర్ లు చిన్న పట్టీ మీద రకరకాల డిజైన్లు కుట్టి, దాన్ని నడుంకు చుట్టుకోవడానికి దారాలు ఇస్తున్నారు. చీర మీద కు మేచింగ్  గా తయారు చేశారు. దాంతో ఉన్నవారు, లేనివారు అనకుండా అందరూ మేచింగ్ పట్టీలు కొనుక్కుని, ధరిస్తున్నారు.

అసలు బెల్ట్ లు ఎక్కడినుండి వచ్చాయి. వడ్డాణంను చూసి, ప్యాంటులు జారిపోకుండా, బంగారం తో చేయలేక, తోలుతో చేశారు. మా పిల్లలకు వడ్డాణం అంటే అర్థం తెలియని రోజుల్లో, అల్లరి చేస్తే వడ్డాణం పెడతా అనేదాన్ని. దాంతో వడ్డాణం కావాలని అనేవారు.

పోడవాటి టవల్ తీసుకొని, గాలిలొ గింగిరాలు తిప్పి, తాడులా చేసి, వారి నడుముకు, కుర్చీకి కలిపి కట్టే దాన్ని. దాంతో అల్లరి బంద్. వడ్డాణం వద్దని ఏడుపు. కానీ ఇలా కట్టేటప్పుడు ఒకోసారి పిల్లలు కిందకు జారి, మెడకు వేసుకుంటారు, జాగ్రత్తగా కాపలా కాయాలి.

నడుంనొప్పి వచ్చినప్పుడు, డాక్టర్ బెల్ట్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇలా బెల్ట్ ధరించిన వారిని, నీ వడ్డాణం ఎంత పడింది, ఎక్కడ కొన్నారు, బాగా పనిచేస్తుందా? అని పరామర్శించడం పరిపాటి అయ్యింది.

ఏతావాతా చెప్పోచ్చేది ఏమిటంటే వడ్డాణం ధరిస్తే నడుంనొప్పి, బొజ్జలు రావని మన పూర్వీకులు ధరించేవారు. కానీ ఈ కాలంలో నడుంనొప్పి వచ్చినప్పుడు డాక్టర్ లు ప్రిఫర్ చేశాక, జనం వాడుతున్నారు. కాదనగలరా?

కావాలంటే గూగుల్ లో వడ్డాణం ఇమేజ్ అని సెర్చ్ చేస్తే స్లిమ్ లైనర్స్, బెల్ట్ లు వస్తాయి. నేను గోల్డ్ గర్డిల్, ఏంషియంట్ జివలరీ, ఆర్నమెంట్ అని సెర్చ్ చేయగా, అసలు వడ్డాణం బొమ్మలు వచ్చాయి. కావాలంటే మీరు ప్రయత్నించండి.

Leave a Reply

Exit mobile version