గాడిద గుడ్డు చదవగానే, ఆమాత్రం జ్ఞానం లేదా గాడిద ఎక్కడైనా గుడ్డు పెడుతుందా ? పిల్లల్ని కంటుంది.-అని సాధారణంగా అనుకుంటాం.
ఇంగ్లీష్ మీడియంలో చదివిన మా ఫ్రెండ్ చెప్పింది గాడ్ ఈజ్ గ్రేట్. హీ కాంకర్డ్ పీస్. దీన్ని గాడిద గుడ్డు గంగర పీసు అనడం మొదలెట్టారు.
గాడిద గుడ్డు గురించి మా ఇంట్లో ఒక చిన్న సంఘటన నవ్వొచ్చేది చెప్తాను. మా ఇంట్లో ఒక నౌకరు ఉండేవాడు. ఒకటో తారీఖు జీతం తీసుకుంటే, పదవ తారీకు వరకు కనిపించేవాడు కాదు. 11 వ తారీకు నుంచి 30 వ తారీఖు వరకు టంచను గా పనికి వచ్చే వాడు.
ఒకటో తారీఖు జీతం తీసుకుని ,పదో తారీకు వరకు చక్కగా తాగేవాడు. మా కీ వి షయాలేమి తెలియవు.ఒకసారి అతని భార్య మా ఇంటికి వచ్చి, అతను జీతం తీసుకొని ,మొత్తం తాగుతున్నాడు. కాబట్టి కొద్ది జీతం నాకు ఇవ్వండి ,అని అడిగింది.
ఆమె వెంట ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ముగ్గురు చిన్నపిల్లలే. సరేనని ,ఆ పిల్లలకి ఇంట్లో ఉన్న పప్పలు పెట్టాను. ఆ పిల్లల పేర్లు అన్ని అడుగుతున్నాము. ఈ లోపల, ఆమె- మా ఆయనకి మధ్యలో అమ్మాయి అంటే బాగా ఇష్టం ,ఎందుకంటే అమ్మాయి పుట్టినప్పుడు ఉద్యోగం వచ్చింది అని చెప్పింది. అంతేకాక ఆ మధ్యలో కూతురు ఏం చెప్తే అది చేస్తాడు ,కొనుక్కో స్తాడు అని చెప్పింది.
సరేనని తమాషా చేద్దామని ,ఏదో బొమ్మ ,చక్కని కొడుకు గుడ్డు టైపులో కనిపిస్తుంది ,తీసుకుని దీన్ని గాడిదగుడ్డు అంటారు. మా నాన్న తెచ్చాడు. చాలా టేస్ట్ గా ఉంటుంది .మీ నాన్నకి నువ్వంటే ఇష్టం కదా. వెళ్లి మీ నాన్న ని కూడా తెమ్మను, బజార్లో దొరుకుతుంది. గాడిదగుడ్డు ఇంతవరకు నీకు కొని పెట్టలేదా? అంటే మీ నాన్నకు, నువ్వంటే ఇష్టం లేదు. అందుకే నీకు కొనలేదు -ఇలా రెచ్చగొట్టి వదిలాము.
ఒక వారం తర్వాత అతను వచ్చి లబోదిబోమని కాళ్ళావేళ్ళా పడ్డాడు. ఒకటి- జీతం మొత్తం వాళ్ళ ఆవిడకి వెళ్తుందని, తన చేతిలో పైసా లేదని, ఖర్చులకు కొద్దిగా ఇప్పించమని.
రెండు- నా కూతురు నన్ను పీక్కు తింటుంది. గాడిదగుడ్డు ఎక్కడైనా ఉంటుందా అమ్మ? దొరకదని చెప్పండమ్మా! మా పిల్లను తీసుకొస్తాను అని.
సరే తీసుకురా, అలాగే చెప్తాను అని చెప్పా. అతను ముగ్గురు పిల్లల్ని తీసుకొచ్చాడు. పెద్దదాన్ని, చిన్నదాన్ని నడిపించుకు వచ్చాడు. మధ్యదాన్ని భుజాల కెత్తుకున్నాడు.
పది రోజులు పని మానేసి , మమ్మల్ని విసిగిస్తే, అంత తేలిగ్గా ఎందుకు ఊరుకుంటాం. ఆ పిల్లని దగ్గరికి పిలిచి, మీ నాన్న ఇంకా గాడిద గుడ్డు కొని పెట్టలేదా? మా నాన్న ఇందాకే కొని పెట్టాడు .చాలా బాగుంది. మీ నాన్నకి నువ్వంటే ఇష్టం లేదు. అందుకే కొని పెట్టట్లేదు. వెళ్లి మీ నాన్న ను,గాడిదగుడ్డు కొనిపెట్టమని పీకు, అని రెచ్చ గొట్టాము.
రెండు రోజుల తర్వాత అతను వచ్చి, మళ్ళా లబోదిబో మన్నాడు. గాడిద గుడ్డు దొరకదని చెప్పండమ్మా అంటే ,మళ్ళా గాడిద గుడ్డు కొన్నారని చెప్పేరంటమ్మా. పిల్ల పీక్కు తింటుంది-అని.
మరి నువ్వు రోజు బుద్ధిగా పని లోకి వస్తే ,మమ్మల్ని విసిగించకుండా ఉండుంటే ,మేము నీ పిల్లలకు గాడిదగుడ్డు ఉండదని చెప్పేదాన్ని. నువ్వేమో పని ఎగ్ కొడుతున్నావ్ ,కాబట్టే అలా చేశాను, అన్నాను.
ఇక నుంచైనా సరిగ్గా పనిలోకి రా, అప్పుడు నేను మీ పిల్లలకు చెప్తాను- అన్నా. కానీ అతను వచ్చింది లేదు, నేను ఆ పిల్లలకి చెప్పింది లేదు. కానీ ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు, ఈ విషయాన్ని చెప్పి, అందరినీ నవ్విస్తూ ఉంటాను.
Comments
Loading…
Loading…