Menu
in ,

గాజుపెంకులు

అమ్మ చేతి గాజుల గలగలలు వింటే, అదో ఆనందం. నేను మా అమ్మ చేతి మట్టి గాజులను కదుపుతూ ఉంటే, అమ్మ తిట్టేది, చిట్లుతాయి.. వదులు, అని.

సెలవుల్లో, పండుగలకు నేను డజన్ల మట్టి గాజులను వేసుకుని, ఆనందించే దాన్ని. స్కూలు తెరవగానే, ఒకటి ఉంచి, మిగతావి తీసేదాన్ని.

మా పిల్లలు, నా చేతికి గాజులు వేసుకుంటే చాలు, ఆడతారు, చిట్ల కొడతారు. మధ్యలో గాయాలు, రక్తం. ఎందుకులే అని, మట్టి గాజులు తీసేశాను. పిల్లలంతా ఇంతేనేమో. తల్లులంతా అంతేనేమో.

చిన్నప్పుడు చిట్లిన గాజు ముక్కల్ని,కెలీడియో స్కొప్ లో వేసి, రకరకాల రంగులు చూపించేవాడు అన్న. అద్దం తో ఒక గొట్టం చేయించి, కింద మూసి, దాంట్లో గాజు ముక్కలు వేసి, పై నుంచి చూస్తే, అబ్బా., ఎన్ని రంగులో.

కొద్ది గా పెద్దైనాక, గాజు ముక్కల్ని, కొవ్వొత్తి మంటలొ పెట్టి, అతికించి, హ్యాంగింగ్స్ చేసి, గడిపకు వేలాడేసేవాళ్ళం. తర్వాత ఇనపగాజులు, రేకు గాజులు వచ్చాయి. చిట్లవని వాటిని వాడడం మొదలు పెట్టాం.

ఒక ఊళ్ళో గాజు కప్పు పగిలింది. నౌకరుకు, కవరు తెమ్మని,పెంకులన్నీ ఊడ్చి, కవరులోకి, వేయమని చెప్పాం. దాంతో అతని ముఖం మాడిపోయింది. మొత్తానికి పెంకులు అన్నీ ఎత్తినాక, కవరును తీసుకెళ్ళి, చెత్త లో వేయమన్నాము.

నౌకరు, రెండు సార్లు రెట్టించాడు, “చెత్త లో వేయాలా?” అని. అవును, అనగానే, ముఖం దివిటీ లా వెలిగింది.

అమ్మా, రక్షించారు. ఇప్పుడు జేబుకు బొక్క పడుతుందనుకున్నా,  అన్నాడు.

ఎందుకని? అని అడిగాను.పెంకులు అమ్ముకు రమ్మంటారేమో-అని, నసిగాడు.

ఎందుకలా అనుకున్నావు? అని అడిగితే, అంతా జాగ్రత్తగా, కవరులోకి ఎత్తించారుకదా -అన్నాడు.

ఓ అదా. పెంకులు గుచ్చుకుంటాయి. ఎవరివైనా చేతులే కదా. కవరులో వేస్తే, చెత్త ఏరుకునే వాళ్ళకు గుచ్చుకోదు. జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేస్తారు.-అన్నా.

దాంతో అతను తలవూపి, ఇంతకు ముందు అమ్మ గారు, గాజు ముక్కలు,పెంకులు కలెక్ట్ చేసి, మాకు ఇచ్చి, అమ్ముకు రమ్మనే వారు. మేము చేసేదేమీలేక, వాటిని పడేసి, మా జేబులో నుంచి రూపాయి తీసి ఇస్తే, ఓస్, ఇంతేనా, వచ్చింది, ఈ సారి పది రూపాయలు తేవాలి అనేవారు.

మా జేబులు గుల్ల అయ్యేవి. మీరు కవరులోకి ఎత్తమనగానే, మళ్ళీ జేబుకి చిల్లు పడుతుందనుకున్నా -అన్నాడు. పెంకులు ఎత్తమనగానే, అతని ముఖం ఎందుకు మాడిపోయిందో అప్పుడు అర్ధమయింది.

తర్వాత చాన్నాళ్ళ కు వేరొకరితో ఈ మాట అంటూ, నవ్వితే, వాళ్ళు అసలు విషయం చెప్పారు. గాజు తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్ళు, చుట్టు పక్కల ప్రాంతంలో, పగిలిన సీసాలు, పెంకులు, డబ్బిచ్చి కొనుక్కుంటారు. పాపం ఆమె ఆ ప్రాంతంలో నివసించి, ట్రాన్స్ ఫర్ అయి వచ్చుంటది. అక్కడ పద్దతి ఫాలో అయ్యింది. కానీ ఇక్కడ పద్దతి,తెలీకపోయి ఉండవచ్చు. నౌకరికి ధైర్యం చాలక, పరిస్థితి తెలుపలేదు. అందుకనే, అతని జేబు గుల్ల అయ్యింది-అని.

అందుకనే పెద్దలు-అనువుగాని చోట అధికుల మనరాదు-అన్నారేమో.

సూచన-మీ ఇళ్ళలో గాజు పెంకులు, పేపర్లో చుట్టి, చెత్తబుట్టలో వేయండి. దాన్ని తాకిన వారికి గాయాలు కాకుండా, చక్కగా మడత పెట్టండి.

Leave a Reply

Exit mobile version