హమ్ ఆప్ కే కౌన్ హై – సూపర్ హిట్ సినిమాలో పైసే దేదో, జూతే లేలో – సూపర్ హిట్టయిన పాట. దాంట్లో మరదళ్ళ సరదాలను చూపించారు.
ఉత్తరాదిలో పెళ్ళి కొడుకు చెప్పులను దొంగిలించి, తిరిగి ఇవ్వడానికి కొంత సొమ్ము అడుగుతారు మరదళ్ళు. అయితే మగపెళ్ళివారు చెప్పులను చేజారకుండా కాపలా కాస్తారు. ఈ సాంప్రదాయం ను చక్కగా చూపించారు సినిమాలో.
నిజానికి దక్షిణాదిలో కూడా ఈ సంప్రదాయం కొద్ది మార్పులతో పాటిస్తారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో కొన్ని కుటుంబాల్లో ఈ ఆచారం ఉంది. పూర్వం ఇంటి ముందు పందిరి వేసి పెళ్ళిళ్ళు చేసేవారు. మగపెళ్ళివారు ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి ఎత్తుకు రావాలి. ఆడ పెళ్ళి వారు, వారిని లోపలికి వెళ్ళకుండా కాపలా కాయాలి.
మంచి నీరని, తలనొప్పి అని, కాఫీ, టీ వంటి సాకులు చెపుతూ వంటింట్లోకి దూరుతారు. మీకెందుకు శ్రమ అని ఆడ పెళ్ళివారు వంటింటి గుమ్మం కు అడ్డంగా ఉంటారు.
అసలు వంటింట్లో ఏమున్నది అంటారా, బంగారం, లక్ష్మి ఉంటుంది. అరే అవి బీరువాలో ఉంటాయి అంటారా. కానీ నిజానికి లక్ష్మి మసిబట్ట, చీపురు, చేటలో ఉంటుంది. ఇల్లును శుభ్రంగా చేసే వస్తువులను లక్ష్మి దేవి నిలయంగా భావిస్తారు. వీటి కోసం వియ్యాలవారు పడే అవస్ధలు నవ్వు పుట్టిస్తాయి .
పెళ్ళంటే కట్నం, బంగారం వీటి గురించి గొడవలు అనుకుంటారు. కానీ సిల్లీ థింగ్స్ కోసం, తంటాలు పడటం సరదాగా ఉంటుంది. ఇరు కుటుంబాల మధ్య స్నేహం వెల్లి విరుస్తుంది. తర్వాత ఆ వస్తువులను కొత్త పెళ్ళి కూతురికి ఇస్తారు. అవి ఆమె కాపురం పెట్టుకున్నప్పుడు, ఆమె ఇంటికి తీసు వెళుతుంది. పుట్టింటి వారికి, అత్తింటి వారి కి వాటి మీద హక్కు ఉండదు .
చెంబు , తపాలా , అద్దం , గ్లాసు , యాష్ ట్రే , ఫొటో – ఇలా రకరకాల వస్తువులను దొంగిలించి, మగపెళ్ళివారు తీసుకొని వెళ్తారు. ఒకోసారి అరువు తెచ్చుకున్న వస్తువులను తీసుకొని వెళ్తారు. తర్వాత అది అరువు వస్తువుని తెలుసుకుని, వాపస్ ఇస్తారు.
గోదావరి జిల్లాలో ఇంకో సాంప్రదాయం ఉంది. తాళి కట్టాక, గౌరి దేవికి హారతి ఇచ్చి, పెళ్ళి కొడుకు-పెళ్ళి కూతురికి హారతి ఇస్తారు. హారతి పళ్ళెంలో రూపు ఉంటుంది. దానిని చేజిక్కించుకున్న వారు గెలుపొందినట్లు భావిస్తారు.
ఏది ఏమైనా 64 కళలలో ఒకటైన దొంగ తనం, పెళ్ళి వేడుకల్లో సరదా ఘట్టంగా పెద్దలు చేర్చారు.